శ్రీశైలం పుణ్యక్షేత్రం... భక్తుల కోలాహలంతో నిత్యం కళకళలాడే ఆ ప్రాంతంలో ఇప్పుడు తీవ్ర విషాదం అలుముకుంది. భగవంతుని దర్శనానికి వచ్చి, ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్లాల్సిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు విడవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఘటన వివరాలు: శ్రీశైలంలోని వడ్డెర అన్నదాన సత్రం రూమ్ నెంబర్ 11లో సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
మృతుల గుర్తింపు: సుధాకర్ (36), గోగుల ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా పోలీసులు గుర్తించారు.
వెలుగులోకి వచ్చిందిలా: గత 3 రోజులుగా గది నుంచి ఎలాంటి చలనం లేకపోవడం, దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు, హాల్‌లో ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు విగతజీవులుగా పడి ఉన్నారు.
అధికారుల పరిశీలన: ఆలయ ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గత నెల 28వ తేదీన ఆ కుటుంబం రోజువారీ అద్దె ప్రాతిపదికన రూమ్ తీసుకుంది. రెండు రోజుల తర్వాత ఖాళీ చేయాలని కోరినప్పటికీ, అనారోగ్యంతో ఉన్నామని, పూజలు చేయించుకోవాలని చెప్పి వారు అక్కడే కొనసాగారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వడ్డెర సత్రం యాజమాన్యం నెల రోజుల పాటు యాత్రికులకు రూమును ఎందుకు అద్దెకు ఇచ్చిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక ఇబ్బందులే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమని భావిస్తున్న పోలీసులు, మిస్టరీ వీడేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.
Rajatheertha follows strict editorial standards. If you have corrections, updates or editorial queries, contact our desk.
Submit an Editorial Correction →




